Monday, August 30, 2021

కృష్ణం వందే జగద్గురుమ్

బహుశా మా తాత ముత్తాతలు కూడా బాలకృష్ణుని కథలు వింటూ, కృష్ణుని తో మానసికంగా ఆడుకుంటూ బాల్యం గడపి ఉంటారు. మా తరం వారూ అంతే. ఇప్పుడు మా మనుమలూ అంతే. నిజంగా అదృష్టం !
నారాయణ తీర్థులవారు గోపికల ముఖంగా చెప్పినట్టు '...సదా బాలకృష్ణం కలయసఖి సుందరమ్' (బాలకృష్ణుణ్ణి పట్టుకోండి).
కృష్ణుడు ఎప్పుడూ మా బాలకృష్ణుడే అన్న ఒక అందమైన భావన చిన్నప్పుడే మనసులో నాటుకు పోయింది. ఎంతో అదృష్టం !!.
ఆ.తరువాత మతిలేని , మానసిక స్థైర్యం పెంపొందించలేని 'మెకాలే 'చదువులు చదివి ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ జీవితంలో సింహభాగం గడిపేసేను.
చిన్న నాటి స్నేహితుడు కృష్ణుణ్ణి మరచిపోయేను.
జీవితం గతి తప్పింది.
దురాశ , నిరాశ‌ , నిస్సహాయత , భయం అలుముకోవడం మొదలయ్యాయి.
'హే కృష్ణా' అని అసంకల్పితంగా అనుకున్నాను.
నా చిన్న నాటి మిత్రుడు, బాలకృష్ణుడు , ఇప్పుడు ఆచార్యుడిగా ప్రత్యక్షమయి, వెన్నుతట్టి ' కర్తవ్యం మీద దృష్టి పెట్టు., కర్త్రుత్వం విడిచి పెట్టు' అన్నాడు.
జగద్గురువు యొక్క ఈ మాట ఎంతో ఊరటనిచ్చింది. మనస్సు స్థిమిత పడింది. ఆత్మ స్థైర్యం తిరిగి నెలకొంది.
'ధీరమ్ భవజలధి పారమ్ సమస్త వేదసారమ్
సకల యోగితారమ్ సదా బాల కృష్ణం
కలయ సఖీ సుందరం'.  అని నారాయణ తీర్థులవారు ఇందుకే కదా అన్నారు అని అర్థమయింది !
ఇంక కృష్ణుడిని వదిలే ప్రసక్తేలేదు !
'ఉస్ వక్త్ జల్ది ఆనా
నహి శ్యామ్ భూల్ జానా
రాధే కో సాథ్ లానా
జబ్ ప్రాణ్ తన్ సే నిక్ లే '
అన్న ఎవరో కవిగారిలాగే కృష్ణుని కి నేనూ అర్జీ పెట్టుకున్నాను.