Tuesday, October 13, 2020

'40 వసంతాలు..' రొండో రోజు

నాకు నిద్ర మెళకువ వచ్చింది. దుర్గ అప్పటికే నిద్ర లేచి కాఫీ పెడుతోంది. కమ్మని కాఫీ సౌరభం నలుదిశలా పరిమళిస్తోంది. పిల్లలు ఈషాన్ , శ్రేయస్ , శౌర్య  క్రొత్త ప్రదేశ అన్వేషణలో పరుగులు తీస్తున్నారు. చెక్క మెట్ల మీద వాళ్ళ లేత పాదాలు తాకుతూ ఉంటే ఆ ధ్వని జకీర్ హుస్సేన్ తబల దరువు లా విన సొంపుగా ఉంది

ఈ హడావుడి అంతా చూసి నిఝెంగానే తెల్లవారింది కామోసు అనుకుని సూర్యుడు కూడా ఉదయించేసాడు !

నిన్న రాత్రి అందరు తల్లులు , పిల్లలు 'మాస్టర్ బెడ్రూం' లో పడుకున్నారు. హరీష్ , కిశోర్ 'బంక్ బెడ్స్' మీద. చదువుకు ఆటంకం లేకుండా ఉంటుందని 'బేస్మెంట్' లో రికీ ; తోడుగా ఉదయ్.
నాకు , దుర్గ కు మాత్రం సౌకర్యం గా ఉంటుందని 'గ్రౌండ్ ఫ్లోర్' లోని 'బెస్ట్ బెడ్ రూం' !
అందుకే అంటారు 'అడిగితే అంతే వస్తుంది. అడగకపోతే అంతా వస్తుంది' అని.

అలవాటు ప్రకారం డాలీ నాకు , దుర్గ కు 'కన్సాస్' నుండి తెచ్చిన 'గిఫ్ట్' లు ఇచ్చింది.

"కమ్మని భావమే కన్నీరై చిలికెనూ. జీవితమంతా చిత్రమైన పులకింత" అన్న ఆరుద్ర గారి పాట గుర్తొచ్చింది. కళ్ళు చెమర్చాయి!.

ఈ పాటికి డాలీ , గాయత్రి , శ్రీ లత  జమా జట్టీ ల్లాగ దుర్గ చుట్టూ జేరి పనులు అందుకు న్నారు.

ఎవరో కాఫీ గ్లాసు నా చేతిలో పెట్టేరు. రుచి అమోఘం. స్వర్గానికి బెత్తెడే ఎడం!

దగ్గర లోని వేర్వేరు ప్రదేశాల గురించి క్షుణ్ణంగా శోధించిన పిదప 'పైనీ నాబ్' 'ట్రైల్' లో నడుద్దామని కిశోర్ నిర్ధారించేరు.
మూడు కార్లలో బయలుదేరాము.
కొన్ని పరిస్థితులవల్ల ఉదయ్ , డాలీ , కిశోర్ , గాయత్రి మాత్రం అనుకున్న పాదయాత్ర ఆసాంతం చేశారు. మిగిలిన వారమంతా బసకు తిరిగి వచ్చేసాము.

వంట తయారు అయింది.
వంకాయ కూర, సాంబారు, ఉసిరి ఆవకాయ మెనూ.
ఆపాటికి 'హూస్టన్' వారు బసకు చేరుకున్నారు. స్నానాదికాలు పూర్తి అయినాక 'లంచ్' కానిచ్చేము. ఉసిరి ఆవకాయ పెద్ద హిట్!

మరో ఇద్దరి(రేయాంష్ , రిషిక్) రాకతో 'బచ్చా పార్టీ' ఉర్జా పెరిగింది !. సాయంత్రం వీళ్ళందరినీ 'బేస్కెట్ బాల్' ఆడ్డానికి తీసుకుని వెళ్ళేరు. విదుర్ ని తోడు తీసుకుని దుర్గ , డాలీ , గాయత్రి , స్రవంతి , శ్రీ లత బస దగ్గర నడక కు వెళ్ళేరు !.

ఆ రాత్రి డాలీ వండిన మసాలా కిచిడీ మా డిన్నర్ హైలైట్.
అందరం నిద్రలకు ఉపక్రమించాము.
అర్థ రాత్రి కి చైతన్య వాళ్ళు వచ్చేరు. నైనికా 'స్కూల్ వర్క్' వల్ల వాళ్ళకు ఆలస్యమైంది. గాయత్రి వాళ్ళకు డిన్నర్ పెట్టింది.
ఆ తదుపరి వాళ్ళుకూడా నిద్రలోకి జారుకున్నారు.

చైతన్య రాక స్రవంతి కి 'సర్ప్రైజ్' గా ఉండాలి అనుకున్నాం.
కానీ 'బచ్చా పార్టీ' లో ఎవరో 'ఇన్ఫర్మేషన్ లీక్' చేసేరేమోనని నా అనుమానం.
అయినా all fine , all good.
Good night!
To be continued

3 comments:

  1. Very well described day 2 uncle!

    ReplyDelete
  2. చక్కని తెలుగు శివప్రసాద్ గారు 👌

    ReplyDelete
    Replies
    1. పి.ఎస్.రావు గారనుకుంటున్నాను.
      ధన్యవాదములు.

      Delete